రిజర్వేషన్ పరేషాన్.. నిరుద్యోగుల్లో మళ్లీ మొదలైన భయం
*🔥రిజర్వేషన్ పరేషాన్.. నిరుద్యోగుల్లో మళ్లీ మొదలైన భయం🔥*
: ఎస్టీ రిజర్వేషన్లు గందరగోళానికి దారి తీస్తున్నాయి. విద్యాపరమైన అంశాల్లో ఎలా ఉన్నా.. ఉద్యోగాల భర్తీలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గిరిజనులు, ఆదివాసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలుపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో వీటి అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నదని, ఆ ప్రక్రియ పూర్తయ్యి తీర్పు వెలువడిన తర్వాత మాత్రమే ఒక స్పష్టత ఏర్పడుతుందని కేంద్ర ఎస్టీ వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా స్పష్టం చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా తెలంగాణ ఎంపీలు రంజిత్‌రెడ్డి, మాలోతు కవిత అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎస్టీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన లేఖ అందిందని, రాష్ట్ర ప్రభుత్వం 2017లోనే ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదం తర్వాత రాష్ట్రపతి అప్రూవల్ కోసం కేంద్ర హోంశాఖకు పంపిందని, అక్కడి నుంచి తమ మంత్రిత్వ శాఖకు చేరిందని, కానీ దీనిపై నిర్ణయం తీసుకోడానికి సుప్రీంకోర్టులో పలు పిటిషన్లపై విచారణ పెండింగ్‌లో ఉండడమే కారణమని కేంద్ర మంత్రి ఆ సమాధానంలో పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న కొలువుల భర్తీపై అనుమానాలు మొదలవుతున్నాయి
💥
పోస్టులన్నీ చేంజ్ అయ్యే అవకాశం
*🌀రాష్ట్రంలో 80వేల కొలువులు భర్తీ చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్.. దాదాపు 55 వేల పోస్టులకు ఆమోదం తెలిపారు. ఆర్థిక శాఖ నుంచి ఇప్పటికే రెండుసార్లు సవరిస్తూ ఆమోదం ఇచ్చారు. ఎస్టీ రిజర్వేషన్లను పెంచక ముందు 6 శాతంతో ఓసారి.. పెంచిన తర్వాత 10 శాతంతో మరోసారి సవరణలు చేశారు. ఆయా శాఖలు కూడా జాబితాలను పలుమార్లు రెడీ చేశాయి. నియామక సంస్థలకు ఇచ్చిన తర్వాత కూడా రిజర్వేషన్లు మారడంతో మార్పులు అనివార్యమయ్యాయి. ఇప్పుడిప్పుడే వీటిపై కొలిక్కి వస్తున్నాయి. గ్రూప్ –1 మినహా.. చాలా మేరకు పోస్టులన్నీ ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లతో ఖరారు చేశారు. దానికి అనుగుణంగానే గ్రూప్ –4తో పాటుగా పలు పోస్టులకు నోటిఫికేషన్లు సైతం విడుదలయ్యాయి. ఇటీవల ఇచ్చిన జేఎల్పోస్టుల్లో కూడా ఇదే అమలు చేశారు. అటు వైద్యారోగ్య శాఖలోనూ వేల పోస్టులకు ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబరులో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లపై జీవో జారీ చేసింది.*
*💥మొదలైన చిచ్చు*
*💠రాష్ట్రంలో తీర్మానం చేసిన ఈ బిల్లును కేంద్రానికి పంపించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇంకా ఈ బిల్లుకు ఆమోదం తెలపకపోవడంతో అసలు సమస్య ముందుకొచ్చింది. ఇప్పుడు ఏకంగా పార్లమెంట్‌లోనే ప్రకటన చేశారు. ఎస్టీ రిజర్వేషన్లను ఇప్పుడే పెంచమని, సుప్రీం కోర్టు తీర్పు రావాల్సిందేనని స్పష్టత ఇచ్చారు. దీంతో కొలువుల భర్తీ మళ్లీ ప్రశ్నార్థకంలో పడింది. ఇప్పటి వరకు కొలువుల కోసం ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న నిరుద్యోగులు.. కొలువులను భర్తీ చేసేందుకు జాబితా పట్టుకుని పడిగాపులు పడుతున్న ప్రభుత్వ శాఖలకు టెన్షన్పట్టుకుంది. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన పోస్టులు, నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులన్నీ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ల ప్రాతిపదికన ఖరారు చేసి, ఏ వర్గాలకు ఎన్ని పోస్టులో ఖరారు చేశారు. ఇప్పటి వరకు ఉన్న రిజర్వేషన్ల ప్రకారం గిరిజనులకు 10 శాతం చొప్పున ఖరారు చేశారు.*
*💥కోర్టుకెక్కితే కష్టమే*
*🥏ప్రస్తుతం రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం ప్రకటించడంతో.. కోర్టు భయం పట్టుకుంది. ఇప్పటికే చిన్న చిన్న అంశాలపైనా కోర్టు కేసులున్నాయి. ఇలాంటి సమయంలో ఎస్టీ రిజర్వేషన్లపై కోర్టులో పిటిషన్ పడితే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొత్తం పెండింగ్ లో పడుతుందని అధికారులు సైతం చెప్తున్నారు. ఇప్పటికే చాలా మేరకు పోస్టుల్లో రిజర్వేషన్లను మార్చారు. ఇప్పుడు కేంద్రం ప్రకటన ఆధారంగా కోర్టు కేసులు నమోదయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొలువుల కుంభమేళా అంటూ ప్రభుత్వవర్గాలు గొప్పులు చెప్పుకుంటున్నా.. ఇప్పుడు వాటన్నింటికీ పుల్‌స్టాప్ పడే ప్రమాదం పొంచి ఉంది. గిరిజనేతరులు దీనిపై కోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ప్రచారం సైతం మొదలైంది. ఇదే జరిగితే.. ఇక కొలువల కథ సాగదీయడమే.*
.jpeg)
Comments
Post a Comment