తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. ప్రైమరీ కీ ఎప్పుడంటే? తాజా అప్డేట్ ఇదే...
ఈ నెల 16న గ్రూప్-1 పరీక్షను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ కీ విడుదల పై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే.. 8 పని దినాల్లో ప్రైమరీ కీని విడుదల చేస్తామని గతంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో వెల్లడించింది
ఈ మేరకు గడువులోగానే ప్రైమరీ కీని విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారంలోనే కీని విడుదల చేయనున్నట్లు కమిషన్ వర్గాలు వెల్లడించాయి.
సోమవారం నాటికి జిల్లాల నుంచి ఓఎంఆర్ షీట్లు రాజధానికి చేరకోగా.. మంగళవారం నుంచి ఇందుకు సంబంధించిన స్కానింగ్ ప్రక్రియను ప్రారంభించారు టీఎస్పీఎస్సీ అధికారులు. పండుగ సెలవులు పోగా.. ముందుగా ప్రకటించిన మేరకు 8 వర్కింగ్ డేస్ లో కీని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది టీఎస్పీఎస్సీ..
ఇదిలా ఉంటే.. గ్రూప్-1 పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ వస్తోన్న ఆరోపణలను హైదరాబాద్ కలెక్టర్ అమోయ్ కుమార్ ఖండించారు. ఇటువంటి ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదంటూ స్పష్టం చేశారు..
దీనికి సంబంధించి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సికింద్రాబాద్‌లోని లాలాగూడలోని సెయింట్ ఫ్రాన్సిస్ డి సేల్స్ హైస్కూల్‌లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన 47 మంది అభ్యర్థులకు ఇంగ్లిష్/తెలుగు క్వశ్చన్ పేపర్‌కు బదులుగా ఇంగ్లిష్/హిందీ క్వశ్చన్ పేపర్ ఇచ్చారని తెలిపారు..
దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని.. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారికి ఇంగ్లీష్ / తెలుగు ప్రశ్నాపత్రంతో పాటు.. కొత్త ఓఎంఆర్ షీట్లను ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు..
కొత్త ఓఎంఆర్ పత్రాలలో తాము పరీక్ష రాస్తే.. తమ జవాబు పత్రాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మూల్యాంకనం చేయదనే అనుమానంతో అభ్యర్థులు నిరసనకు దిగారని, అయితే కలెక్టర్‌తో పాటు కమిషన్ అధికారులు వాళ్లకు సర్ది చెప్పడంతో మధ్యాహ్నం ఒంటి గంటకు వాళ్లు తిరిగి తమ పరీక్షను కొనసాగించారని తెలిపారు. అయితే ఈ సమయంలో ఏ ఒక్క అభ్యర్థి కూడా బయటకు వెళ్లలేదని.. పరీక్ష పూర్తయిన తర్వాతనే వాళ్లు బయటకు వచ్చినట్లు పేర్కొన్నారు...
నగరంలోని మూడు సెంటర్లలో ఇన్విజిలేటర్ల తప్పిదం వల్ల గ్రూప్–1పరీక్షను ఆలస్యంగా నిర్వహించినట్లు ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని స్టాన్లీ ఇంజినీరింగ్ కాలేజీ, అబిడ్స్‌లో ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన ఇద్దరు అభ్యర్థులకు 15 నిమిషాలు మరియు ఐదుగురు అభ్యర్థులకు 30 నిమిషాలు అదనపు సమయం ఇవ్వబడిందన్నారు. ..
అలాగే, హైదరాబాద్‌లోని అబిడ్స్ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో పరీక్షను పూర్తి చేయడానికి 15 మంది అభ్యర్థులకు ఏడు నిమిషాల అదనపు సమయాన్ని కేటాయించినట్లు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో పైన పేర్కొన్న ఏ పరీక్ష హాలులో లేదా పరీక్షా సెంటర్లోలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు..
TSPSCతో సంప్రదింపుల మేరకు అభ్యర్థులు కోల్పోయిన సమయానికి బదులుగా అదనపు సమయం కేటాయించడం జరిగిందన్నారు. అయితే ఎక్కడైనా అక్రమాలకు పాల్పడినట్లు తేలితే ఇన్విజిలేటర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు...
Comments
Post a Comment