ముగిసిన నవరస నటనా సార్వభౌమ కైకాల సినీ ప్రస్థానం..
తెలుగుతెరపై ఒకదానితో ఒకటి సంబంధంలేని పాత్రలతో విలక్షణమైన నటనతో నవరస నటనా సార్వభౌముడు అనిపించుకున్నారు సత్యనారాయణ.
మహానటుడు ఎస్వీరంగారావు నట వారసుడిగా తెలుగు సినిమా స్వర్ణయుగ చరిత్రలో ఆయనకంటూ ఒక అధ్యాయాన్ని సృష్టించుకున్న విలక్షణ నటుడు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశారు. ఆయన వయసు 88 ఏళ్లు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సత్యనారాయణ కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ తరం వరకు అందరి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు కైకాల సత్యనారాయణ. దశాబ్దాల సుధీర్ఘ సినీ ప్రస్థానంలో దాదాపు 777 చిత్రాల్లో పలు విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. తెరపై తండ్రి పాత్రలైనా..తాతా పాత్రలైనా, ప్రతినాయకుడి పాత్రలోనా, హాస్యనటుడిగా ఇలా అన్నిపాత్రల్లో తనదైన నటనతో ఆకట్టుకొని నవరస నటనా సార్వభౌముడిగా తెలుగుతెరను ఏలారు
ఎన్నో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో తనదైన ముద్రవేసిన అతికొద్ది మంది నటుల్లో సత్యనారాయణ ఒకరు. 1935లో కృష్ణ జిల్లా బంటుమిల్లి గ్రామంలో జూలై 25న జన్మించారు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తితో ఎన్నో నాటకాల్లో నటించారు. 1958లో నిర్మాత డిఎల్ నారాయణ నిర్మించిన ‘సిపాయి కూతురు’ చిత్రంతో నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. సత్యనారాయణలో ఎన్టీఆర్ పోలికలు వుండటంతో ఆయనకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టాయి
కెరీర్ ప్రారంభంలో రామారావుకు డూప్‌గా నటించారు సత్యనారాయణ. ఆ తర్వాత ఎన్టీఆర్ తన చిత్రాల్లో ఆయనకు ప్రత్యేక వేశాలు ఇస్తూ ఆయన్ని నటుడిగా ప్రోత్సహించారు. ప్రముఖ దర్శకుడు విఠలాచార్య సత్యనారాయణలోని విలనిజాన్ని వెలికితీశారు.
పౌరాణిక సినిమాల విషయానికొస్తే...‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో కర్ణుడిగా...‘లవకుశ’లో భరతుడిగా, ‘నర్తనశాల’లో దుశ్శాసునుడిగా, ‘శ్రీకృష్ణపాండవీయం’లో ఘటోత్కచుడుగా, ‘దాన వీర శూర కర్ణ’లో భీముడిగా, ‘కురుక్షేత్రం’లో దుర్యోధనుడిగా, ‘సీతా కళ్యాణం’లో రావణుడిగా, శ్రీరామపట్టాభిషేక’లో భరతుడిగా ఎన్నో విలక్షణ పౌరాణిక పాత్రల్లో విలనిజంతో పాటు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసి మెప్పించారు సత్యనారాయణ.
ముఖ్యంగా డైలాగ్ డిక్షన్‌లోనూ, హావభావాల్లోనూ, ఆకారంలోనూ, నటనలోనూ ఎస్వీఆర్‌కు ఏమాత్రం తీసిపోని విదంగా ఉండటంతో ఆయన నిజమైన వారసుడిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు సాక్షాత్తు ఎస్వీఆర్ కూడా తన నటవారసుడు సత్యనారాయణే ఓ సందర్భంలో చెప్పారు. అంతేకాదు అప్పటి అగ్రనటులైన ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, శివాజీ గణేషణ్‌లకు తన నటనతో గట్టిపోటీ ఇచ్చారు సత్యనారాయణ.
అంతేకాదు ‘యమగోల’, ‘యముడికి మొగుడు’, ‘యమలీల’ వంటి సినిమాల్లో యముడిగా నటించి ఆ క్యారెక్టర్‌లో ఆయన తప్పించి వేరే ఎవరిని ఊహించుకోనంత గొప్పగా నటించారు. దాదాపు ఆరు దశాబ్ధాలకు పైగా సినీ జీవితంలో నాలుగు తరాల నటులతో కలిసి నటించారు సత్యనారాయణ. తెలుగులో అన్ని జానర్స్‌లో తెరకెక్కిన సినిమాల్లో నటించిన ఘనత సత్యనారాయణది.
నటుడిగా ఉంటూనే నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన ‘గజదొంగ’, ‘కొదమ సింహం’,‘బంగారు కుటుంబం’, ముద్దుల మొగుడు’ వంటి సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో రాణించారు సత్యనారాయణ.
తెలుగులో ‘భక్త ప్రహ్లాద’, తమిళంలో ‘కాళిదాస’ వంటి సినిమాలను దర్శకత్వం వహించిన హెచ్.ఎమ్.రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువ. అలాంటి మహానుభావుడి పాత్రతో సత్యనారాయణ మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత మహర్షి వంటి చిత్రాల్లో మెరిసారు. చివరగా సత్యనారాయణ కార్తిక్ రాజు, మిస్తి చక్రవర్తి హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ‘ధీర్ఘాయుష్మాన్ భవ’ చిత్రంలో నటించారు. తెలుగు ఇండస్ట్రీలో లెజెండ్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కైకాల.
Comments
Post a Comment