Google Job : గుంటూరు అమ్మాయికి జాక్‌పాట్.. రూ.60 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం..
ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ సంస్థలో ఏడాదికి 60 లక్షల రూపాయల భారీ ప్యాకేజీతో ఉద్యోగం వస్తే సూపర్ కదా..! మన గుంటూరు అమ్మాయి రావూరి పూజిత ఆ లక్ష్యాన్ని చేరుకుంది.
గూగుల్‌లో ఉద్యోగం వస్తేనే చాలు అని ఎందరో యువత పోటీ పడుతుంటారు. మరి అదే సంస్థలో ఏడాదికి 60 లక్షల రూపాయల భారీ ప్యాకేజీతో ఉద్యోగం వస్తే సూపర్ కదా..! మన గుంటూరు అమ్మాయి రావూరి పూజిత ఆ లక్ష్యాన్ని చేరుకుంది. దీనికంతటికీ కారణం.. లాక్‌డౌన్ మహాత్మ్యమే అట..! ఆ విజయగాథలోకి వెళ్తే.. ఆ మాటల్లోనే.. బీటెక్ ఫస్టియర్‌లో ఉండగా కొవిడ్-19 మొదలైంది.. అప్పుడే లాక్‌డౌన్ కూడా పెట్టారు. దాంతో చాలామందిలానే నాకూ కాలేజీలకు వెళ్లి చదువుకునే అవకాశం లేకుండా పోయింది. అలాగని నేనేమీ బాధపడలేదు. కాలేజీ వాళ్లు ఆన్‌లైన్లో చెప్పే పాఠాలని శ్రద్ధగా వినేదాన్ని. నా సందేహాలు, సమస్యలను వీలున్నంత వరకూ టీచర్లనో, సీనియర్లనో అడిగేదాన్ని. వీలుకానప్పుడు ఆన్‌లైన్‌లో వెతికేదాన్ని.
ఏ సాప్ట్‌వేర్ కంపెనీ అయినా కోడింగ్ నుంచే ఎక్కువ ప్రశ్నలు సంధిస్తుంది కాబట్టి దానిపై పట్టుకోసం చాలా వెబ్‌సైట్లు చూసేదాన్ని. ఆ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని కోడింగ్, ఇతర ప్రాబ్లమ్స్‌తో పాటు ఉద్యోగం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకున్నా. రోజులో సగం సమయం ఆన్‌లైన్ క్లాసులు వింటే తక్కిన సమయంలో ఆన్‌లైన్‌లో సొంతంగా నేర్చుకొనేదాన్ని. నాకు నేనే పరీక్ష పెట్టుకునేదాన్ని. ఎక్కడ తప్పులు చేస్తున్నానో తెలుసుకునే దాన్ని. లీట్‌కోడ్, కోడ్ షెఫ్, ప్రెప్‌బైట్స్, బైనరీ సెర్చ్‌డాట్‌కాం వంటి సైట్లలో కోడింగ్, ఇతర అంశాలు బాగా ఉండేవి.
టైం మేనేజ్‌మెంట్ నేర్చుకొని.. ఆన్‌లైన్ అసెస్‌మెంట్లు, ఇంటర్వ్యూలు సాధన చేశా. తరచూ మాక్ ఇంటర్వ్యూలకు హాజరయ్యేదాన్ని. ఆన్‌లైన్‌లో సీనియర్లతో పరిచయాలు పెంచుకుని వాళ్ల అనుభవాలు తెలుసుకునేదాన్ని. ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి ఇవన్నీ నాకు బాగా ఉపకరించాయి. అలా గూగుల్, అడోబ్, అమెజాన్ సంస్థల్లో కొలువులు సాధించాను. చాలా సంతోషంగా అనిపించింది. కాకపోతే అమెజాన్, అడోబ్ కంపెనీల్లో వార్షిక ప్యాకేజీ రూ.45 లక్షలు ఉండటంతో రూ.60 లక్షల ప్యాకేజీతో గూగుల్ అవకాశాన్ని ఎంచుకున్నా. త్వరలో ఇంటర్న్‌షిప్‌కు వెళ్తున్నా అంటూ తన విజయగాథని చెప్పింది
Comments
Post a Comment