Telangana New CS: తెలంగాణ కొత్త సీఎస్ ఎవరు సస్పెన్స్ వీడింది , కొత్త సీఎస్‌గా శాంతికుమారి నియామకం, ఆమె గురించిన పూర్తి వివరాలు !
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ అధికారిణి శాంతికుమారి నియమితులయ్యారు.
సీఎస్‌గా ఉన్న సోమేశ్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి రిలీవ్ చేసింది. ఏపీ కేడర్‌కు సోమేష్ కుమార్‌ను మంగళవారం అప్పగించడంతో ఆయనను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 12వ తేదీలోపు ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని సోమేశ్ కుమార్ ను డీవోపీటీ ఆదేశించింది.
తాజాగా తెలంగాణ సీఎస్‌గా అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం మధ్యాహ్నం 3.15 గంటలకు బీఆర్ కేఆర్ భవన్ లో నూతన సీఎస్‌గా ఆమె భాద్యతలు స్వీకరించారు.
తెలంగాణలో తొలి మహిళా సీఎస్‌గా శాంతికుమారి
అంతకుముందు బుధవారం నాడు సీనియర్ అధికారిణి శాంతికుమారి సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆమె 1989 బ్యాచ్ కు చెందిన అధికారిణి. ఆమె ఏప్రిల్ 2025 వరకు రాష్ట్ర సీఎస్‌గా కొనసాగనున్నారు. సీనియర్ అధికారిణి శాంతికుమారి ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. గతంలో వైద్యారోగ్య శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో సీఎం కార్యాలయంలో స్పెషల్ ఛేజింగ్ సెల్ లో సేవలు అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేసులో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్లు ప్రధానంగా వినిపించాయి.
రేసులో 1987 బ్యాచ్ ఐఏఎస్ వసుధ మిశ్రా ముందంజలో ఉన్నారు. అయితే డెప్యూటేషన్ పై యూపీఎస్సీ సెక్రటరీగా మంచి పదవిలో ఉండడం.. మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయనుండడంతో ఆమె పోటీలో లేరు. రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాణికుముదిని(1988 బ్యాచ్)కి సైతం ఆరు నెలలకు మించి సర్వీసు లేదు. వీరిద్దరి తర్వాత సీనియారిటీ ప్రకారం 1989 బ్యాచ్ కు చెందిన శాంతి కుమారి, 1990 బ్యాచ్ అధికారులైన శశాంక్ గోయల్ (డెప్యూటేషన్ పై ప్రస్తుతం కేంద్రంలో ఉన్నారు), రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, 1991 బ్యాచ్ అధికారులైన రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు, కేంద్ర జలవనరుల శాఖ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పేర్లను పరిశీలించిన సీఎం కేసీఆర్ చివరగా శాంతి కుమారి వైపు మొగ్గు చూపారు. శాంతికుమారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Post a Comment