HCU: దేశంలోని యూనివర్సిటీల్లో 'హెచ్‌సీయూ' అగ్రస్థానం, ప్రకటించిన నేచర్ ఇండెక్స్ సంస్థ!
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి అరుదైన గుర్తింపు లభించింది.
దేశంలోని యూనివర్సిటీల విభాగంలో మొదటి స్థానంలో నిలిచినట్లు నేచర్ ఇండెక్స్ సంస్థ తాజాగా ప్రకటించింది. అంతర్జాతీయ జర్నల్‌గా ప్రపంచంలోనే పేరొందిన ఆ సంస్థ పలు పరిశోధన పత్రాలను ప్రచురించడంతోపాటు విశ్వవిద్యాలయాలు, సాంకేతిక పరిజ్ఞాన సంస్థల పనితీరును విశ్లేషిస్తుంది. ఇందుకోసం ఆయా విశ్వవిద్యాలయాలు, సాంకేతిక పరిజ్ఞాన సంస్థల పరిశోధన పత్రాల ర్యాంకింగ్‌లను పరిగణనలోకి తీసుకుంటుంది.
విభిన్నంగా, నాణ్యంగా ఉన్న పత్రాలను అన్నికోణాల్లో పరిశీలించి అత్యుత్తమమైన వాటిని ఎంపిక చేస్తుంది. వాటి ద్వారా సమాజానికి జరిగిన, జరగనున్న మేలు, భవిష్యత్తులో రాబోయే మార్పులను విశ్లేషిస్తుంది. ఈ నివేదికలో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, యూనివర్సిటీ ఆఫ్ కోల్‌కతా, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ వంటి దిగ్గజ విశ్వవిద్యాలయాలను వెనక్కినెట్టి హెచ్‌సీయూ అగ్రస్థానంలో నిలవడం విశేషం.
నేచర్ ఇండెక్స్ సంస్థ.. పరిశోధనలను, వాటి ఫలితాల ఆధారంగా ఆయా సంస్థలు, విశ్వవిద్యాలయాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ నుంచి 300 వరకూ స్థానాలను ప్రకటిస్తుంది. ఈ సంస్థ ద్వారా పొందిన స్థానాలు చాలా విలువైనవి. వీటి ద్వారా విదేశీ వర్సిటీలు, పరిశోధన సంస్థలు, పరిశ్రమలు ఆయా విశ్వవిద్యాలయాలతో మరిన్ని పరిశోధనలకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. నేచర్ ఇండెక్స్ ఈ స్థానాలను ఇచ్చేందుకు 2021 డిసెంబరు 1, నుంచి 2022 నవంబరు 30 వరకు మధ్య కాలాన్ని పరిగణనలోకి తీసుకుంది. 12 నెలల్లో విశ్వవిద్యాలయాలు, సాంకేతిక పరిజ్ఞాన సంస్థలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో జరిగిన పరిశోధనలను పరిశీలించింది.
తొలిస్థానం దక్కించుకోవడం గర్వకారణం - వీసీ
దేశంలోని వంద విశ్వవిద్యాలయాల్లో తొలిస్థానం దక్కించుకోవడం గర్వకారణమని హెచ్‌సీయూ ఉపకులపతి ప్రొ. బీజేరావు అన్నారు. అన్ని విభాగాలు, శాస్త్ర సాంకేతిక పరిశోధనల్లో ఆచార్యులు, అధ్యాపక బృందం, విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శిస్తున్నారు. గతేడాదితో పోల్చితే నేచర్ ఇండెక్స్ తీసుకున్న విభాగాల్లో మా విశిష్టత పెరిగింది. ఇంతేకాదు.. నాలుగేళ్ల నుంచి వరుసగా ప్రథమస్థానంలోనే ఉన్నాం. ఈ విజయంతో వచ్చే ఏడాది ప్రతి విభాగంలోని ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి విశ్వవ్యాప్త గుర్తింపునకు కృషిచేస్తామని ఆయన పేర్కొన్నారు.
Comments
Post a Comment