మీ సొంత వాట్సాప్ ఛానెల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసా..? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీ కోసం..
ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) కొత్త ఫీచర్లతో కమ్యూనికేషన్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరుస్తోంది.
సరికొత్త సర్వీసులను తీసుకొస్తూ ఆకట్టుకుంటోంది. ఇటీవల భారత్ సహా చాలా దేశాల్లో ఛానెల్స్ (Channels) ఫీచర్ లాంచ్ చేసింది. నచ్చిన సెలబ్రిటీలు, వ్యక్తులు, సంస్థల ఛానెళ్లను ఫాలో అవుతూ వారికి సంబంధించిన అప్‌డేట్స్ అన్నీ వాట్సాప్‌లోనే తెలుసుకోవచ్చు. ఫోన్ నంబర్ వంటి పర్సనల్ వివరాలు ఇవ్వకుండా లేదా చాట్స్‌ను గందరగోళంగా మార్చకుండా ఛానెల్స్‌ను ఫాలో అవ్వచ్చు.
ఛానెల్స్‌ను వాట్సాప్‌లోని కొత్త అప్‌డేట్స్ ట్యాబ్‌లో యాక్సెస్ చేయవచ్చు. డైరెక్టరీలో ఛానెల్స్ కోసం సెర్చ్ చేయవచ్చు. ఛానెల్స్ వన్-వే బ్రాడ్‌కాస్ట్ కమ్యూనికేషన్, కాబట్టి వాటిని క్రియేట్ చేసిన వ్యక్తులు మాత్రమే మెసేజ్‌లు పంపగలరు. అంటే వాట్సాప్ ఛానెల్స్ గ్రూప్ చాట్ లాగానే ఉంటాయి, కానీ యజమాని మాత్రమే మెసేజ్‌లు సెండ్ చేయగలరు. వీటిని ఎలా క్రియేట్ చేయాలి, ప్రైవసీ ఫీచర్లు ఏంటి, అడ్మిన్లు ఏం పోస్ట్ చేయగలరు వంటి వివరాలు తెలుసుకుందాం....
* వాట్సాప్ ఛానెల్ క్రియేట్ చేసే ప్రాసెస్
స్టెప్ 1: వాట్సాప్ యాప్‌ను అప్‌డేట్ చేయాలి. హోమ్‌పేజీలో కనిపించే అప్‌డేట్స్ (Updates) ట్యాబ్‌పై నొక్కాలి.
స్టెప్ 2: స్టేటస్ సెక్షన్ కింద ఛానెల్స్ (Channels) ట్యాబ్ కనిపిస్తుంది. దాని పక్కనే ఉన్న ప్లస్ + బటన్‌పై ట్యాప్ చేయాలి.
స్టెప్ 3: "క్రియేట్ ఛానెల్ (Create channel)" ఆప్షన్‌పై నొక్కాలి.
స్టెప్ 4: ఛానెల్ కోసం పేరు, డిస్క్రిప్షన్ ఎంటర్ చేయాలి. కెమెరా ఐకాన్‌ను నొక్కి ఫోన్ నుంచి ఏదైనా ఫొటోను సెలెక్ట్ చేసుకొని ఛానల్ ఐకాన్‌గా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఛానల్ DP కోసం లైవ్ పిక్చర్, ఎమోజీలు, వెబ్‌సెర్చ్ నుంచి కూడా పిక్స్ తీసుకోవచ్చు.
స్టెప్ 5: వివరాలు ఇచ్చాక క్రియేట్ ఛానెల్ బటన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. యూజర్లు వారికి కావలసినన్ని ఛానెల్స్ క్రియేట్ చేసుకోవచ్చు.
* అడ్మిన్లకి కంట్రోలింగ్
ఛానల్ క్రియేట్ చేసుకున్న అడ్మిన్లు పబ్లిక్ ఛానెల్‌లో ఫొటోలు, టెక్స్ట్ మెసేజ్‌లు, లింక్స్ లేదా మరేదైనా పోస్ట్ చేయవచ్చు. ఛానెల్‌లోని కంటెంట్‌ను స్క్రీన్‌షాట్స్ తీయకుండా ఫాలోవర్లను ఆపవచ్చు. ఫార్వర్డ్‌లను కూడా కంట్రోల్ చేయవచ్చు. ఛానెల్‌ను ఎవరు ఫాలో అవ్వచ్చో, అది డైరెక్టరీలో కనిపించాలో లేదో నిర్ణయించుకోవచ్చు.
ఫాలోవర్లు ఛానెల్‌లోని మెసేజ్‌లు చూడగలరు కానీ వాటికి రిప్లై ఇవ్వలేరు. ఎమోజీలతో మాత్రం మెసేజ్‌లకు రియాక్ట్ అవ్వగలుగుతారు. ఛానెల్స్ ఎన్‌క్రిప్ట్ అవ్వవు, అంటే వాట్సాప్ వాటిని చదవగలదు. వాట్సాప్ అడ్మిన్లు తమ ఛానెల్స్‌తో ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువ కావాలని కోరుకుంటుంది. అయితే వారు స్పామ్, హానికరమైన లింక్స్ పోస్ట్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాట్సాప్‌కి ఉంది. అందుకే వాటిని ఎన్‌క్రిప్ట్ చేయడం లేదు.
* ప్రైవసీ
ఛానెల్ అడ్మిన్‌గా యూజర్ ఫోన్ నంబర్, ప్రొఫైల్ ఫోటో ఫాలోవర్లకు కనిపించవు. ఏదైనా ఛానెల్‌ని ఫాలో అయినప్పుడు, ఫోన్ నంబర్ అడ్మిన్లకు లేదా ఇతర ఫాలోవర్లకు కనిపించదు. ఎవరిని ఫాలో అవుతున్నారు అనేది ప్రైవేట్‌గా ఉంటుంది. వాట్సాప్ ఛానెల్ హిస్టరీని 30 రోజుల వరకు మాత్రమే స్టోర్ చేస్తుంది.
Peerya nayak
ReplyDelete